భారత్‌కు క్షమాపణలు చెప్పిన ఐక్యరాజ్యసమితి.. కారణమిదే?

గాజాలోని రఫా నగరంలో ప్రయాణిస్తున్న ఐక్యరాజ్యసమితి వాహనంపై దాడి జరగగా భారత మాజీ ఆర్మీ అధికారి వైభవ్ అనిల్ కాలే మరణించిన విషయం తెలిసిందే.

Update: 2024-05-15 07:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని రఫా నగరంలో ప్రయాణిస్తున్న ఐక్యరాజ్యసమితి వాహనంపై దాడి జరగగా భారత మాజీ ఆర్మీ అధికారి వైభవ్ అనిల్ కాలే మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఐరాస స్పందించింది. భారత్‌కు క్షమాపణలు చెప్పింది. ‘భారత ప్రభుత్వానికి, ప్రజలకు క్షమాపణలు. కాలే కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. భారత్ అందించిన సహకారాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘోరమైన దాడిపై విచారణ చేపట్టేందుకు ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. దీనిపై అత్యంత వేగంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇజ్రాయెల్‌తో చర్చలు జరపుతున్నామని స్పష్టం చేశారు. కాగా, 2022లో భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన కల్నల్ వైభవ్ రెందు నెలల క్రితమే యూఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో కోఆర్డినేషన్ ఆఫీసర్‌గా జాయిన్ అయినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News