సుస్థిర ప్రభుత్వానికే కన్నడిగుల ‘ఓటు’..!

కర్ణాటక ఓటర్లు ఈసారి సుస్థిర ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారు. అస్థిర ప్రభుత్వాలతో గత కొన్నేళ్లుగా విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు మే 10వ తేదీన జరిగే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి మెజారిటీ ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు.

Update: 2023-04-29 12:26 GMT

బెంగళూరు: కర్ణాటక ఓటర్లు ఈసారి సుస్థిర ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారు. అస్థిర ప్రభుత్వాలతో గత కొన్నేళ్లుగా విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు మే 10వ తేదీన జరిగే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి మెజారిటీ ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఏ పార్టీకి మెజారిటీ రాకపోయిన సందర్భాల్లో వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యేలతో కోట్లాది రూపాయల బేరాలు నిర్వహించారని, దీంతో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలిందని, అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు ముఖ్యంగా యువత ఆవేదన చెందుతున్నారు. అందుకే ఈసారి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగేట్లు ఏదైనా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు.

19 ఏళ్లలో 11 మంది సీఎంలు..

రాష్ట్రంలో బీజేపీకి ఎన్నడూ పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది. 1999, 2013లో పూర్తి మెజారిటీ సాధించిన కాంగ్రెస్ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కులాలు, వర్గాలు, మతాల ప్రాతిపదికన ఓటర్లలో చీలిక రావడంతో హంగ్ ప్రభుత్వాల ఏర్పాటు అనివార్యమవుతోంది. పార్టీల మధ్య ఆధిపత్య పోరు వల్ల 2004 నుంచి ఇప్పటి వరకు 11 మంది ముఖ్యమంత్రులు మారారు.

గత ఎన్నికల తర్వాత కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు (యడియూరప్ప, బొమ్మై) మారారు. సైద్ధాంతికంగా వ్యతిరేకించే పార్టీలు సైతం అధికారం కోసం అవకాశవాద పొత్తులు పెట్టుకుంటున్నాయి. 2008, 2019 ఎన్నికల్లో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో ‘ఆపరేషన్ కమలం’ పేరుతో ఇతర పార్టీలతో సహా స్వతంత్ర ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

పార్టీల ఎత్తుకు పైఎత్తులు..

మెజారిటీ కోసం ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తమ ప్రత్యర్థి పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో పాగా వేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో కుల, మత, ప్రాంత, వర్గ సమీకరణాల్లో మునిగిపోయాయి. మరోవైపు ‘కింగ్ మేకర్’ అయ్యేందుకు జనతాదళ్(ఎస్) పావులు కదుపుతోంది. కాంగ్రెస్, బీజేపీలకు పూర్తి మెజారిటీ రాకుండా హంగ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే జేడీ(ఎస్) కోరిక నెరవేరుతుంది. రాష్ట్రంలో హంగ్ తప్పదని పేర్కొన్న గత సర్వేలు కాంగ్రెస్ కు మెజారిటీ వస్తుందని తాజా సర్వేల్లో పేర్కొన్నాయి. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజల మూడ్ మారిందని తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో చూడాలి.

Tags:    

Similar News