విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ వెనుక మాస్టర్ స్కెచ్!

తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీపై చర్చ జోరందుకుంది.

Update: 2024-02-01 13:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని అది కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేలా కసరత్తు జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ పేరు నమోదు కోసం పని జరుగుతోందని.. పార్టీ పేరులో ప్రజలు, తమిళనాడు, అభివృద్ధి కనిసి ఉండేలా 'తమిళ మున్నెట్ర కళగం' అనే పేరును విజయ్ ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తన అసలైన రాజకీయ అరంగేట్రం 2026 తమిళనాడు అసెబ్లీ ఎన్నికలే అయినప్పటికీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయ్ తన పొలిటికల్ కెరీర్ ట్రయల్ టెస్ట్ చేయబోతున్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే 2026 ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్న విజయ్ ఇంతలో అడ్వాన్స్ గా అది కూడా లోక్ సభ ఎన్నికల ముంగిట్లో పొలిటికల్ పార్టీ ప్రయోగం ఎందుకు చేస్తున్నారనేది అనేక సందేహాలకు తావిస్తోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ వెనుక ఆయన ఆలోచనే ఉందా లేక మరేదైనా మాస్టర్ మైండ్ వెనుకుండి నడిపిస్తోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

పొత్తా? ఒంటరిగానేనా?:

తమిళ చిత్రసీమలో స్టార్ డమ్ తో వెలిగిపోతున్న విజయ్ సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు నిత్యం టచ్ లో ఉంటున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఆయన తన సన్నిహితులతో రాజకీయ చర్చలు జరపడంతో లోక్ సభ ఎన్నికల నాటికి ఆయన పార్టీ అనౌన్స్ పక్కా అనే ప్రచారం జరుగుతోంది. అయితే లోక్ సభ ఎన్నికల నాటికి విజయ్ పార్టీ ప్రకటిస్తే పోటీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఒంటరిగానే పోటీ చేస్తారా లేక ఎవరికైనా మద్దతు ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. బీజేపీ విధానాలను గతంలో విజయ్ విమర్శించారు. అయితే తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని కాషాయ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో డీఎంకే, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో రాబోయే ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీధి మయం కూడా ఈ కూటమితో జతకట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం సౌత్ ఇండియాలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ ఇప్పటికే ఆపరేషన్ సౌత్ మిషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీ వెనుక బీజేపీ ఏమైనా ఉందా అనే తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఓ వర్గం అనుమానాలను వ్యక్తం చేస్తోంది.

బీజేపీలో ఆ పార్టీ విలీనం:

దక్షిణ భారతదేశంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అందుకు అవసరమైన అన్ని అస్త్రాలను ఉపయోగించుకుంటోంది. తాజాగా కేరళలో పీసీ జార్జ్ పార్టీ బీజేపీలో విలీనం కావడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీసీ జార్జ్ కేరళ కాంగ్రెస్ నుంచి వేరు పడి 2019లో కేరళ జన పక్షం (సెక్యులర్) పార్టీని స్థాపించారు. తాజాగా ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ భారత దేశం విషయంలో బీజేపీ సారిస్తున్న ఫోకస్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలువురు సినీ ప్రముఖులకు బీజేపీ గాలం వేస్తోందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ దళపతి రాజకీయ రంగ ప్రవేశం వెనుక ఎవరైనా ఉన్నారా? లేక తన ఆసక్తి మేరకు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారా అనేది కాలమే సమాధానం చెప్పనున్నది.

Tags:    

Similar News