అవినితి నిర్మూలనే ఎన్డీయే 3.0 లక్ష్యం: ప్రధాని నరేంద్ర మోడీ

దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించడంపైనే ఎన్డీయే 3.0 దృష్టి పెడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన అనంతరం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.

Update: 2024-06-04 17:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించడంపైనే ఎన్డీయే 3.0 దృష్టి పెడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన అనంతరం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. వరుసగా మూడోసారి అధికారంలోకి ఎన్డీయే అధికారంలోకి వచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల విజయం అని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ ఎంతో సమర్ధవంతంగా నిర్వహించిందని కొనియాడారు. బీజేపీకి సొంతంగా వచ్చినన్ని సీట్లు ఐక్యంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షం గెలవలేకపోయిందని విమర్శించారు. బీజేపీ, ఎన్డీయేపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

అన్ని రకాలుగా అవినీతిని రూపుమాపడమే తమ తదుపరి ప్రభుత్వ దృష్టి అని తెలిపారు. ‘భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుంది. డిజిటల్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తుంది’ అని తెలిపారు. ‘స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత 12 కోట్ల మందికి కుళాయి నీరు అందింది. 4 కోట్ల మందికి శాశ్వత ఇళ్లు లభించాయి. 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందింది’ అని గుర్తు చేశారు. మూడో టర్మ్‌లో దేశం పెద్ద నిర్ణయాలకు సాక్ష్యంగా ఉంటుందని, ఇది మోడీ హామీ అని స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 


Similar News