పండగపూట కేంద్రం శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు

పండగపూట దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 11 నిత్యావసర ఆహార పదార్థాల ధరలు తగ్గాయని పేర్కొంటూ ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.

Update: 2022-10-04 08:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పండగపూట దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 11 నిత్యావసర ఆహార పదార్థాల ధరలు తగ్గాయని పేర్కొంటూ ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. దేశంలో వంట నూనె ధరలను స్థిరంగా ఉంచేందుకు ఇప్పటికే దిగుమతులపై రాయితీని అమలు చేస్తున్న కేంద్రం తాజాగా పండగల వేళ ఈ రాయితీని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ రాయితీని 2023 మార్చి 23 వరకు పొడిగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా.. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం, దిగుమతి సుంకాలు తగ్గడంతో, భారతదేశంలో వంట నూనెల రిటైల్ ధరలు గణనీయంగా పడిపోయాయని తాజాగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

గత నెలలో 11 నిత్యావసర ఆహార పదార్థాల సగటు ధరలు 2-11శాతం తగ్గుముఖం పట్టడంతో నిత్యావసర వస్తువుల ధరలు దిగివచ్చాయని, దీంతో నెలవారీ గృహ బడ్జెట్‌కు ఉపశమనం లభించిందని మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 11 వస్తువుల ధరల తగ్గుదలను చూపించే చార్ట్‌ను ఆయన ట్వీట్ చేశారు. సెప్టెంబరు 2, 2022న లీటరుకు రూ.132గా ఉన్న పామాయిల్ సగటు ధర అక్టోబర్ 2న గరిష్టంగా 11 శాతం తగ్గి రూ.118కి చేరిందన్నారు. వనస్పతి నెయ్యి కిలో రూ.152 నుంచి రూ.143కి, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటరుకు రూ.176 నుంచి రూ.165కి, సోయాబీన్ ఆయిల్ లీటరుకు రూ.156 నుంచి రూ.148కి, ఆవనూనె ధర లీటరు రూ.173 నుంచి రూ.167కు, వేరుశెనగ నూనె ధర లీటరుకు రూ.189 నుంచి రూ.185కి చేరిందని పేర్కొన్నారు. ఉల్లి ధర కిలో రూ.26 నుంచి రూ.24కి, బంగాళదుంప ధర కిలో రూ.28 నుంచి రూ.26కి పడిపోయింది. పప్పు ధాన్యాలు, పప్పులు కిలో రూ. 74 నుంచి రూ.71కి దిగి వచ్చాయన్నారు.

Tags:    

Similar News