బెంగాల్ ఘటన దేశానికే అవమానకరం..! గవర్నర్ ఆనంద్ బోస్
కోల్ కతా లో జరిగిన జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటన బెంగాల్ కే కాదు, యావత్ దేశానికే అవమానకరమని అన్నారు బెంగాల్ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్.
దిశ, వెబ్ డెస్క్: కోల్ కతా లో జరిగిన జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటన బెంగాల్ కే కాదు, యావత్ దేశానికే అవమానకరమని అన్నారు బెంగాల్ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్. కాగా ఆగస్టు 14 న.. డాక్టర్ పై లైంగిక దాడి జరిగిన ఆర్జీకర్ ఆసుపత్రిలో కొంతమంది విధ్వంసం సృష్టించిన సంగతి తెల్సిందే. అయితే ఇవాళ ఉదయం గవర్నర్ ఆర్జీకర్ ఆసుత్రిని సందర్శించి, అక్కడున్న విద్యార్థులతో కలిసి మాట్లాడారు. ఆర్జీకర్ ఆసుపత్రి విధ్వంసం ఘటన పౌరసమాజానికి సిగ్గు చేటని, ఈ ఘటనకు కారకులైన వారి మీద కఠినచర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి.. కొంతమంది ప్రభుత్వ పోలీసులే ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం దారుణమని అన్నారు. డాక్టర్ పై లైంగిక దాడి మరియు హత్యకు బెంగాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆనంద్ బోస్ తెలిపారు. ఈ ఘటనతో యావత్ దేశమే ఉలిక్కిపడిందని ఆయన అన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఎం మమత ప్రభుత్వం దాచే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కాగా ఆగస్టు 10 న జూనియర్ డాక్టర్ పై లైంగిక దాడి మరియు హత్య జరిగింది. తమ కూతురిని గ్యాంగ్ రేప్ చేసి చంపినట్లు ఆమె తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ కూడా వేశారు.