‘డార్క్ నెట్’ ద్వారా ఉగ్ర వ్యాప్తి.. సైబర్ దాడిని అరికట్టాలి: Amit Shah

ఉగ్రవాదులు తమ గుర్తింపును దాచి పెట్టేందుకు, రాడికల్ విషయాలను వ్యాప్తి చేసేందుకు ‘డార్క్ నెట్’ను ఉపయోగిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.

Update: 2023-07-13 14:37 GMT

న్యూఢిల్లీ: ఉగ్రవాదులు తమ గుర్తింపును దాచి పెట్టేందుకు, రాడికల్ విషయాలను వ్యాప్తి చేసేందుకు ‘డార్క్ నెట్’ను ఉపయోగిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. గురుగ్రామ్‌లో రెండు రోజుల జీ-20 సదస్సులో అమిత్ షా గురువారం మాట్లాడారు. రాడికల్ చర్యల తీరును అర్ధం చేసుకొని, వాళ్ల ఆట కట్టించేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. సైబర్ దాడి ప్రపంచంలోని అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను ఇబ్బందులకు గురి చేస్తోందని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు బలమైన, సమర్థవంతమైన కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

డార్క్ నెట్‌లో నడుస్తున్న కార్యకలాపాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలు తమ ప్రచారం, రిక్రూట్‌మెంట్, శిక్షణను విస్తృతంగా చేసుకునేందుకు మెటావర్స్ కొత్త అవకాశాలు ఇస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం, ఆర్థిక వ్యవస్థలను మెటావర్స్ ద్వారా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు పాలన, ప్రజా సంక్షేమంలో డిజిటల్ మార్గాలను ప్రోత్సహిస్తున్నాయన్న అమిత్ షా ప్రజలు డిజిటల్ ప్లాట్ ఫారమ్‌లను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు.


Similar News