తమిళనాడులో కల్తీమద్యం కలకలం.. 13 మంది మృతి

తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం తాగి 13 మంది చనిపోయారు. మరో 70 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Update: 2024-06-19 17:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం తాగి 13 మంది చనిపోయారు. మరో 70 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం కరుణాపురంలోని వ్యాపారి దగ్గర స్థానిక కూలీలు కల్తీ మద్యం ప్యాకెట్లు కొనుగోలు చేశారు. అది తాగిన తర్వాత అందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి లాంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. 70 మందికి పైగా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చేరారు. దాదాపు 18 మందిని మెరుగైన వైద్యం కోసం పుదుచ్చేరిలోని జిప్మర్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఆరుగురిని సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల బ్లడ్ శాంపిల్స్ ను విల్లువపురం, జిప్మర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపించారు. మద్యంలో మిథనాల్ అనే విషపదార్థం కలిపినట్లు తేలింది. మరోవైపు, అక్రమంగా మద్యం విక్రయిస్తున్న గోవింద్ రాజ్ అలియాస్ కన్నుకుట్టిని(49) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి దాదాపు 200 లీటర్ల పాకెట్ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

అధికారులపై వేటు

ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. కేసును విచారించాలని సీబీసీఐడీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని బదిలీ చేశారు. వారిస్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా, జిల్లా ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్‌కు చెందిన 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. మంత్రులు ఇ.వి.వేలు, ఎం. సుబ్రహ్మణ్యం కళ్లకురిచ్చి ఆస్పత్రుల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.


Similar News