Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో కుడి ఎడమైతే! పార్టీలు ఒకవైపు.. అభ్యర్థులు ఇంకోవైపు
కొందరు సీనియర్లు పార్టీ మాటను కాదని నామినేషన్లు దాఖలు చేయగా.. కొందరు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కోసం పోటీ నుంచి తప్పుకున్న పరిస్థితులు మహారాష్ట్రలో నెలకొన్నాయి.. పార్టీలు ఒకవైపు నిలిస్తే.. అభ్యర్థులు మరోవైపు నిలిచినట్టుగా మహారాష్ట్ర రాజకీయం కనిపిస్తున్నది.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర(Maharashtra)లో నెలకొన్న సంక్లిష్ట మహాయుతి(Mahayuthi Alliance), మహావికాస్ అఘాదీ(Maha Vikas Aghadi) కూటములను నామినేషన్ల దశ(Nominations) మరింత జటిలం చేసింది. సీనియర్లను, రెబల్స్(Rebels)ను బుజ్జగించడంలో పార్టీలు విజయవంతం కాలేదు. రెబల్స్, స్వతంత్రుల అవతారమెత్తిన సీనియర్లు. పార్టీ మాటను కాదని నామినేషన్లు దాఖలు చేయగా.. కొందరు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కోసం పోటీ నుంచి తప్పుకున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలు ఒకవైపు నిలిస్తే.. అభ్యర్థులు మరోవైపు నిలిచినట్టుగా మహారాష్ట్ర రాజకీయం కనిపిస్తున్నది. ఇది అధికార, ప్రతిపక్ష శిబిరాలను గందరగోళంలోకి నెట్టింది.
ఎనిమిది మంది సిట్టింగ్‌లను కాదని బీజేపీ కొత్త అభ్యర్థులకు అవకాశమివ్వగా, కాంగ్రెస్ పార్టీ ఐదుగురు సిట్టింగ్‌లకు మొండిచేయి చూపింది. కొందరు అధికారిక అభ్యర్థులను కాదని, స్వతంత్రంగా బరిలో నిలవడంతో పార్టీలు తలలుపట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల స్వతంత్ర నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదాహరణకు చంద్రాపూర్‌లో బీజేపీ అధికారిక దేవరావ్ భొంగాలేపై పోటీగా ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు సంజయ్ దోతే, సుదర్శన్ నింకార్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. దక్షిణ సోలాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి దిలిప్ మానేను బలపరచగా.. శివసేన అభ్యర్థి బరిలో నిలిచారు. ఎన్సీపీ/ఎస్పీకి కూడా ఇలాంటి పరిస్థితులే పంధర్‌పూర్-మంగల్‌వేదలో ఎదురవుతున్నాయి. ఇక ఔరంగాబాద్‌లో షిండే వర్గం శివసేన అభ్యర్థి ప్రదీప్ జైస్వాల్ కోసం శివసేన(యూబీటీ) అభ్యర్థి కిషన్‌చంద్ తన్వానీ నామినేషన్ వేయలేదు. మొత్తంగా మహారాష్ట్రలో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసినా 15 స్థానాల్లో అభ్యర్థులపై పార్టీలు స్పష్టత ఇవ్వలేని పరిస్థితి.