Delhi:‘ సీఎం భార్య విశ్రాంతి తీసుకుంటున్నారు.. దేవుడు అన్నీ చూస్తున్నాడు’

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-09-04 15:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం సునీతా.. బిభవ్ కుమార్, విజయ్ నాయర్‌ల ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, దీనిపై మాలీవాల్ ఎక్స్‌లో స్పందిస్తూ, నన్ను కొట్టినప్పుడు ఇంట్లో ఉన్న ముఖ్యమంత్రి భార్య చాలా 'ఉపశమనం' పొందారు. నాపై దాడి చేసిన బిభవ్ కుమార్ ఇప్పుడు బెయిల్‌‌పై విడుదలైనందుకు "విశ్రాంతి" పొందుతున్నారు, "మహిళలపై దాడి" చేయాలని ప్రతి ఒక్కరికి ఇది "స్పష్టమైన సందేశం" అని అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మొదట మహిళలను కొట్టి ఆ తర్వాత ప్రాణాలతో బయటపడిన వారిని అసభ్యంగా ట్రోలింగ్ చేస్తూ, బ్రతికి ఉన్న వారిని పూర్తిగా నాశనం చేస్తుంది, ఇలా చేయడానికి ప్రత్యేకంగా టీమ్‌ను నియమించుకుంటుంది. అలాగే, దాడి చేసిన వ్యక్తిని రక్షించడానికి దేశంలోని అత్యంత ఖరీదైన న్యాయవాదులు నియమిస్తుంది. ఇలాంటి వారిని చూసి ఓదార్పునిచ్చే వారి నుంచి మన సోదరీమణులు, కూతుళ్ల పట్ల గౌరవం ఎలా ఆశించగలం.. దేవుడు అన్నీ చూస్తున్నాడు.. న్యాయం చేస్తాడు అని మాలీవాల్ పోస్ట్‌లో పేర్కొంది.

అంతకుముందు మే 18న ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి చేసినందుకు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై చార్జిషీటు దాఖలు చేయగా, దానిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. నేరపూరిత బెదిరింపులు, హత్యకు ప్రయత్నించడం వంటి వాటితో సహా భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ నిబంధనల ప్రకారం బిభవ్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా షరుతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.


Similar News