లోక్ సభ స్పీకర్ పదవిపై ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. మరోసారి ఆ పార్టీకే ఛాన్స్..?

పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు

Update: 2024-06-17 11:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి.. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హ్యాట్రిక్ విజయం సాధించిన మోడీ.. మూడో సారి భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు 72 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపు సైతం పూర్తి అయ్యింది. దీంతో లోక్ సభ స్పీకర్ పదవిపై దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లోక్ సభ అధ్యక్ష పదవి ఏ పార్టీకి చెందిన వ్యక్తికి దక్కుతుందోనని ఆసక్తి నెలకొంది. ఈ సారి బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (272) సీట్లు బీజేపీకి సొంతంగా రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూ పార్టీలు కీలకంగా మారాయి.

ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ పదవిని ఈ రెండు పార్టీలు ఆశిస్తున్నాయి. స్పీకర్ పోస్ట్‌ను తమకు ఇవ్వాలని ఈ రెండు పార్టీలు బీజేపీపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర కేబినెట్‌లో కూడా కీలకమైన హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశీ వంటి శాఖలన్నీ బీజేపీ తమ వద్దే ఉంచుకుంది. దీంతో స్పీకర్ పదవి ఎట్టి పరిస్థితుల్లో తమకు ఇవ్వాలని టీడీపీ, జేడీయూ కోరుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే, సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన స్పీకర్ పోస్ట్‌ను కూడా బీజేపీ తమ వద్దే పెట్టుకోవాలని డిసైడ్ అయినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వినబడుతున్నాయి.

ఈ సారి ఇండియా కూటమి బలంగా ఉండటంతో సభ వ్యవహారాలు నడపటం కీలకంగా మారనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని లోక్ సభ స్పీకర్ పదవిని బీజేపీకి చెందిన వ్యక్తికే ఇవ్వాలని కాషాయ పార్టీ హై కమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. స్పీకర్ పదవికి పోటీ పడుతోన్న టీడీపీ, జేడీయూ రెండు పార్టీల్లో ఏదో ఒకరికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని యోచనలో బీజేపీ ఉన్నట్లు టాక్. స్పీకర్ పదవి కోసం పోటీ పడకుండా టీడీపీ, జేడీయూలను ఒప్పించే టాస్క్‌ను బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ నెల 24 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. 25 లేదా 26 తేదీలో స్పీకర్ ఎన్నికను నిర్వహించనున్నారు.

దీంతో రంగంలోకి దిగిన రాజ్‌నాథ్ సింగ్ టీడీపీ, జేడీయూలను స్పీకర్ రేసు నుండి తప్పించే పనిలో నిమగ్నమైపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. స్పీకర్ రేసు నుండి తప్పుకుంటే గవర్నర్ పదవులు ఇస్తామని టీడీపీ, జేడీయూ పార్టీలకు బీజేపీ హై కమాండ్ ఆఫర్ ఇచ్చినట్లు టాక్. మరీ బీజేపీ ఆఫర్‌కు తలొగ్గి టీడీపీ, జేడీయూ రేస్ నుండి తప్పుకుంటాయా..? డిప్యూటీ స్పీకర్ పదవి అయిన టీడీపీకి దక్కుతుందా..? జేడీయూకి దక్కుతుందా..? అని దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరీ లోక్ సభ స్పీకర్ పదవి ఏ పార్టీని వరిస్తోందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Similar News