జడ్జి వర్సెస్ జడ్జి.. సుప్రీంకోర్టులో కీలక విచారణ.. ఏమిటీ వ్యవహారం ?

దిశ, నేషనల్ బ్యూరో : ఒక అరుదైన అభియోగంపై శనివారం సుప్రీంకోర్టు ఎదుట వాదనలు జరగనున్నాయి.

Update: 2024-01-26 16:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఒక అరుదైన అభియోగంపై శనివారం సుప్రీంకోర్టు ఎదుట వాదనలు జరగనున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ సహా ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు శనివారం ఉదయం 10:30 గంటలకు ఈ కేసును విచారించనున్నారు. ఈ అరుదైన కేసు కోల్‌కతా హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులకు సంబంధించినది. కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమెన్ సేన్‌పై అదే కోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ చేసిన ఆరోపణలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. జస్టిస్ సౌమెన్ సేన్‌ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఆరోపించారు. మెడికల్ అడ్మిషన్ల కోసం నకిలీ కులం సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయనే అభియోగాలపై సీబీఐ దర్యాప్తునకు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ సారథ్యంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలు జారీచేసింది. అనంతరం బెంగాల్ సర్కారు కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ పిటిషన్‌ను దాఖలు చేసింది. న్యాయమూర్తి జస్టిస్ సౌమెన్ సేన్‌‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలపై స్టే విధించింది. అనంతరం మరోసారి ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ.. సీబీఐ దర్యాప్తునకు ఇంకో దఫా ఆర్డర్స్ ఇచ్చారు. అంతేకాదు న్యాయమూర్తి జస్టిస్ సౌమెన్ సేన్‌‌ రాజకీయ ప్రలోభాలతో తీర్పులు ఇస్తున్నారనే అంశాన్ని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. ‘‘ఇటీవల కోర్టు సెలవులకు ముందు జస్టిస్ అమృత సిన్హాను జస్టిస్ సౌమెన్ సేన్‌ తన ఛాంబర్‌కు పిలిపించారు.సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. ఆయనను డిస్టర్బ్ చేయొద్దని జస్టిస్ అమృత సిన్హాకు చెప్పారు’’ అని కూడా తన ఆర్డరులో జస్టిస్ గంగోపాధ్యాయ పేర్కొన్నారు.

Tags:    

Similar News