Remo D'souza : రెమో డిసౌజా చీటింగ్ కేసు విచారణ బదిలీ
కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రెమో డిసౌజాపై ఇటీవల నమోదైన చీటింగ్ కేసు విచారణను సుప్రీం కోర్టు శుక్రవారం బదిలీ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రెమో డిసౌజాపై ఇటీవల నమోదైన చీటింగ్ కేసు విచారణను సుప్రీం కోర్టు శుక్రవారం బదిలీ చేసింది. ఘజియాబాద్ నుంచి ఢిల్లీలోని కర్కార్‌దుమా కోర్టుకు కేసు బదిలీ చేసినట్లు దేశ అత్యున్నత న్యాయ స్థానం తెలిపింది. రెమో డిసౌజా ప్లీపై వాదనలు విన్న తర్వాత జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు తీర్పు వెల్లడించింది. 2016లో తనపై నమోదైన కేసులో అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన ఆర్డర్లను కొట్టివేయాలని డిసౌజా సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా బదిలీ చేశారని డిసౌజా తరఫు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. ఇద్దరి మధ్య కేవలం అగ్రిమెంట్ ఉల్లంఘన మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు. తన సినిమాలో పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు ఇస్తానని రెమో డిసౌజా నమ్మించి మోసగించాడని ఫిర్యాదుదారుడు గతంలో పోలీస్ కంప్లైంట్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రెమో డిసౌజాపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం 420, 406, 386 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.