నీట్-యూజీ పరీక్ష పిటిషన్ల విచారణను జులై 18కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యూజీ 2024లో అవకతవకలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించాల్సి ఉండగా, తాజాగా దానిని జులై 18కి వాయిదా వేసింది

Update: 2024-07-11 09:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యూజీ 2024లో అవకతవకలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించాల్సి ఉండగా, తాజాగా దానిని జులై 18కి వాయిదా వేసింది. ఆరోజు పిటిషన్లపై విచారణ జరుపుతామని కోర్టు గురువారం తెలిపింది. జులై 8న ఇచ్చిన ఆదేశాల ప్రకారం, కేంద్రం, ప్రతిష్టాత్మక పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తమ అఫిడవిట్‌లను దాఖలు చేశాయని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే కొంతమంది పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కేంద్రం, ఎన్టీఏ దాఖలు చేసిన అఫిడవిట్లను ఇంకా అందుకోలేదని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఈ కేసును జూలై 18న విచారణకు వాయిదా వేసింది.

మరోవైపు గురువారం నీట్ పేపర్ లీక్‌పై దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తన నివేదికలో నీట్‌ ప్రశ్నపత్రం బీహార్‌లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితమైందని విస్తృతంగా వ్యాప్తి చెందలేదని పేర్కొంది. దీనికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో సీబీఐ సుప్రీంకోర్టుకు అందజేసింది.


Similar News