ఆప్ అభ్యర్థే విజేత.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది
దిశ, నేషనల్ బ్యూరో: ‘చండీగఢ్ మేయర్ ఎన్నిక’ వివాదంలో సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌నే విజేతగా ప్రకటించింది. దీంతో కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఈ వివాదానికి అత్యున్నత స్థానం తీర్పుతో ఎండ్ కార్డు పడింది. వివరాల్లోకెళ్తే, గత నెల 30న చండీగఢ్ మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ‘ఇండియా’ కూటమి తరఫున ఆప్ నుంచి కుల్దీప్ కుమార్ బరిలో నిలవగా, బీజేపీ ఒంటరిగానే తమ అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఎన్నికల రోజున మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. పోలింగ్ అనంతరం ప్రిసైడింగ్ అధికారి అనిల్ మాసిహ్ ఫలితాను ప్రకటించారు. ఇందులో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్‌కు 16 ఓట్లు వచ్చాయి. కూటమి అభ్యర్థికి 12ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి మనోజ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే, ప్రిసైడింగ్ అధికారి 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. దీనిపై ఆప్, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. బీజేపీ ఒత్తిడితో ఓట్లను కావాలనే చెల్లకుండా చేశారని ఆరోపించాయి. అంతేకాకుండా, బ్యాలెట్ పేపర్లపై ‘ఎక్స్’ మార్క్ పెడుతున్నట్టు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. దీంతో ఫలితాలను సవాల్ చేస్తూ ఆప్ లీడర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పలు హియరింగ్‌ల అనంతరం మంగళవారం తుది తీర్పును వెలువరించింది. ‘‘ఎక్స్ మార్క్ పెట్టి చెల్లనివిగా చేసిన ఆ 8 ఓట్లను పిటిషనర్(కుల్దీప్ కుమార్)కు జత చేస్తే, ఆయనకు పడిన ఓట్ల సంఖ్య 20కి చేరుతుంది. ప్రిసైడింగ్ అధికారి ప్రకటించిన ఫలితాలను రద్దు చేయాలని నిర్దేశిస్తున్నాం. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
రిటర్నింగ్ అధికారిపై సీరియస్
విచారణలో భాగంగా రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికల ప్రక్రియను మాసిహ్ చట్ట విరుద్ధంగా మార్చడమేకాక కోర్టు ముందు అబద్ధాలు చెబుతున్నారంటూ మొట్టికాయలు వేసింది. ప్రభుత్వోద్యోగుల చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించినందుకు అనిల్‌కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. అనిల్ మసీహ్‌పై సీఆర్పీసీ సెక్షన్ 340 కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చూపించాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌ను ఆదేశించింది. కాగా, సోమవారం నాటి విచారణలోనే రిటర్నింగ్ అధికారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన ధర్మాసనం.. చెల్లనివిగా పేర్కొన్న 8 ఓట్ల బ్యాలెట్లను కోర్టులో సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆ ఓట్లను పరిశీలించడం, వీడియో చూడటంతోపాటు వాదోపవాదనలు విన్న ధర్మాసనం.. ఈ ఎన్నికల ప్రక్రియను మాసిహ్ ట్యాంపరింగ్ చేశారని తేలుస్తూ తాజా తీర్పు వెలువరించింది. కాగా, ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణలు కొనసాగుతుండగానే మేయర్‌గా ఎన్నికైన బీజేపీ నేత మనోజ్ సోంకర్ తన పదవికి సోమవారమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.