Supreme court: ఎన్ఆర్ఐ కోటా ఒక మోసం.. పంజాబ్‌లో ఎంబీబీఎస్ ప్రవేశ నిబంధనపై సుప్రీంకోర్టు

ఎంబీబీఎస్‌లో ఎన్ఆర్ఐ కోటా కింద అడ్మిషన్ల వియంలో పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.

Update: 2024-09-24 14:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎంబీబీఎస్‌లో ఎన్ఆర్ఐ కోటా కింద అడ్మిషన్ల వియంలో పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్‌ఆర్‌ఐ కోటా నిర్వచనాన్ని విస్తరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంజాబ్ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఎన్‌ఆర్‌ఐ కోటా విధానం మోసం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించింది. దీనికి వెంటనే ముగింపు పలకాలని సూచించింది. ఎన్‌ఆర్‌ఐ కోటా కింద అడ్మిషన్‌లో బంధువులను చేర్చుకోవడం సరికాదని సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇది డబ్బు సంపాదించుకునేందుకు ఒక ఎత్తుగడ లాంటిదని అభిప్రాయపడింది. దీని ద్వారా విద్యా వ్యవస్థ బలహీనపడుతుందని పేర్కొంది. పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తున్నట్టు వెల్లడించింది.

కాగా, ఎన్ఆర్ఐల బంధువులు సైతం ఎన్ఆర్ఐ కోటా కింద ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందొచ్చని పంజాబ్ ప్రభుత్వం ఆగస్టు 20న ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిని పంజాబ్ హైకోర్టు ఈ నెల 11న రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా..దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టి వేసింది. అయితే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లు ఈ కోటా ప్రవేశానికి విస్తృత నిర్వచనాన్ని అనుసరిస్తున్నాయని పంజాబ్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది వాదించగా అందుకు ధర్మాసనం ఏకీభవించలేదు. 


Similar News