SEBI: చిన్న ఇన్వెస్టర్లకు నష్టం కలిగించే బిగ్ ప్లేయర్స్ వివరాలు వెల్లడించాలి: రాహుల్

ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ చేస్తూ చిన్న మదుపరులు భారీగా నష్టపోతున్న నేపథ్యంలో ఈ విషయంపై కాంగ్రెస్ నేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-24 14:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్ చేస్తూ చిన్న మదుపరులు భారీగా నష్టపోతున్న నేపథ్యంలో ఈ విషయంపై కాంగ్రెస్ నేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న రిటైల్ ఇన్వెస్టర్లను నష్టపరచి లాభాలు ఆర్జిస్తున్న 'బిగ్ ప్లేయర్స్' పేర్లను వెల్లడించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు ఎక్స్‌ పోస్ట్‌లో ఆయన వ్యాఖ్యానిస్తూ, అనియంత్రిత ఎఫ్అండ్ఓలో ట్రేడింగ్ గత ఐదేళ్లలో 45 రెట్లు వేగంగా పెరిగింది. మూడేళ్లలో 90% చిన్న పెట్టుబడిదారులు రూ. 1.8 లక్షల కోట్లు కోల్పోయారు. అయితే ఈ సమయంలో లాభపడిన బిగ్ ప్లేయర్స్ అని పిలవబడే వారి పేర్లను సెబీ బయటకు వెల్లడించాలని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇటీవల సెబీ వెల్లడించిన దాని ప్రకారం, గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్అండ్ఓ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తున్న వారిలో దాదాపు 93 శాతం మంది లేదా 10 మందిలో తొమ్మిది మంది నష్టాలను మూటగట్టుకున్నారని వెల్లడించిన ఒక రోజు తరువాత రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


Similar News