సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు.. ప్రమాణం చేయించిన సీజేఐ

సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు.

Update: 2023-07-14 11:02 GMT

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిలతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ఈరోజు ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. దీంతో సుప్రీంకోర్టుకు మంజూరు అయిన మొత్తం 34 జడ్జి పోస్టుల్లో 32 ఇప్పటివరకు భర్తీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం జూలై 5న సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును జూలై 12న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.ఈ ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతిపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బుధవారం ప్రకటన చేశారు.

జస్టిస్ ఉజ్జల్ భుయాన్..

1964 ఆగస్టు 2న జన్మించిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్.. 2011 అక్టోబరు 17న గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన అంతకుముందు గౌహతి హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2022 జూన్ 28 నుంచి ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. పన్నుచట్టాలపై ఆయనకు స్పెషలైజేషన్ ఉంది. “ఉజ్జల్ భుయాన్ తీర్పులు చట్టం, న్యాయానికి సంబంధించిన విస్తృత సమస్యలను కవర్ చేస్తాయి. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సమగ్రత, సమర్థత కలిగిన న్యాయమూర్తి” అని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

జస్టిస్ వెంకటనారాయణ భట్టి..

1962 మే 6న జన్మించిన జస్టిస్ భట్టి.. 2013 ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన అంతకుముందు అదే హైకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా సేవలందించారు. 2022 ఆగస్టు నుంచి సుప్రీంకోర్టు బెంచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదని సుప్రీంకోర్టు కొలీజియం తన తీర్మానంలో పేర్కొంది. ఈ లోటును భర్తీ చేసేందుకుగానూ జస్టిస్ భట్టికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించారు. జస్టిస్ భట్టి 2019 మార్చిలో కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2023 జూన్ 1 నుంచి అక్కడ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.


Similar News