వయనాడ్ ఉప ఎన్నిక.. ప్రియాంకా గాంధీ టార్గెట్ ఇదే!
వయనాడ్ పార్లమెంటు(Wayanad by-election) స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi)ని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: వయనాడ్ పార్లమెంటు(Wayanad by-election) స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi)ని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరు కేరళకు వెళ్లారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరికొందరు సీనియర్ నేతలు కూడా హాజరవుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు సీనియర్లు హాజరు కాబోతున్నారు. గతంలో ఆ స్థానం నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేసినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేర్వేరుగా పాల్గొన్నారు.
ప్రస్తుతం ప్రియాంకా గాంధీ తరపున కూడా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు పలువురు మంత్రులు వయనాడ్‌లో ప్రచారం చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కోజికోడ్ మున్సిపల్ మహిళా కార్పొరేటర్ నవ్య హరిదాస్‌ను రంగంలోకి దింపుతున్నారు. సీపీఐ తరపున గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన సత్యన్ మోకేరి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 3.54 లక్షల ఓట్ల మార్జిన్‌తో రాహుల్ గాంధీ గెలిచారు. ప్రియాంకాగాంధీ ఈసారి ఐదు లక్షలకు పైగా మార్జిన్‌తో గెలిచేలా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.