Supreme Court: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్ కొట్టివేత

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పుని సమీక్షించాలని కోరుతూ 10 పిటిషన్లు దాఖలయ్యాయి.

Update: 2024-10-04 11:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పుని సమీక్షించాలని కోరుతూ 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపైన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘దాఖలైన అన్ని పిటిషన్లు పరిశీలించాం. తీర్పును సమీక్షించాల్సిన పరిస్థితులు కనిపించలేదు. అందుకే వాటిని కొట్టివేస్తున్నాం’’ అని కోర్టు పేర్కొంది.

కేసు ఏంటంటే?

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్లలో 50 శాతానికి పెంచుతూ 2006లో పంజాబ్‌ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అలాంటి ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. దానిని సవాల్‌ చేస్తూ పంజాబ్‌ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ కూడా ఇందులో ఒక పిటిషనర్‌గా ఉన్నారు. పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 2020లో దీనిని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దీని విచారణను చేపట్టి.. 6:1 ఆధిక్యంతో తీర్పు వెలువరించింది. ఎస్సీల రిజర్వేషన్లను వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలు కల్పించడానికి పచ్చజెండా ఊపింది. అయితే, ఆ తీర్పుని సమీక్షించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.


Similar News