Fishermen: తమిళ మత్స్యకారులకు ఊరట.. 50 మందిని రిలీజ్ చేసిన శ్రీలంక
తమ సముద్ర జలాల్లో చేపల వేటకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అరెస్ట్ చేసిన 50 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ విడుదల చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: తమ సముద్ర జలాల్లో చేపల వేటకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అరెస్ట్ చేసిన 50 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ శుక్రవారం విడుదల చేసింది. తమిళనాడులోని మైలాడుతురై, పుదుకొట్టై, నాగపట్నానికి చెందిన భారతీయ మత్స్యకారులు రిలీజ్ అయినట్టు కొలంబోలోని భారత హై కమిషన్ వెల్లడించింది. వారం రోజుల్లో వారు రాష్ట్రానికి తిరిగి వస్తారని తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య సంబంధాల్లో మత్స్యకారుల సమస్య వివాదాస్పదంగా మారింది. రెండు దేశాలకు చెందిన మత్స్యకారులు ఒకరి జలాల్లోకి మరొకరు చొరబడడంతో తరచుగా అరెస్టులు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఈ తరహా ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి అనేక మంది భారత మత్య్సకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించాలని, భారత మత్య్సకారుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ క్రమంలోనే 50 మంది మత్స్యకారులు విడుదల కావడం గమనార్హం. కాగా, గత నెలలో ఏడుగురిని, ఆగస్టులో 30 మంది మత్స్యకారులను భారత్‌కు రప్పించారు.