విద్వేష ప్రసంగాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశం
విద్వేష ప్రసంగాలపై సుప్రీం కోర్టు కొరడా ఝుళిపించింది.
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీం కోర్టు కొరడా ఝుళిపించింది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ నాయకులు ద్వేష పూరిత ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నందున ఇలాంటి వారిపై ఫిర్యాదులు అందకున్నా కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. కేసులు నమోదు చేయడంలో జాప్యం చేస్తే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని శుక్రవారం హెచ్చరించింది. ద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరింది.
విద్వేషత ప్రసంగాల కేసుల్లో ఎఫ్ఐఆర్‌ను సుమోటోగా నమోదు చేయాలని సుప్రీం కోర్టు 2022 అక్టోబరులో జారీ చేసిన ఉత్తర్వులను ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలే అమలు చేస్తున్నాయని, ఇతర రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి విద్వేష ప్రసంగాలు గొడ్డలిపెట్టు అని హెచ్చరించింది. రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేసినప్పుడే రెచ్చగొట్టే ప్రసంగాలకు తెర పడుతుందని జస్టిస్ కె.ఎం. జోసెఫ్, జస్టిస్ బి.వి. నాగరత్నతో కూడిన సుప్రీం ధర్మాసనం గత నెలలో అభిప్రాయపడింది.