Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు కేసు.. శాస్త్రీయ సర్వేకు సుప్రీంకోర్టు అనుమతి

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వేను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

Update: 2023-08-04 12:28 GMT

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వేను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే మసీదులో తవ్వకాలు జరపకుండా, కట్టడానికి హాని కలిగించని రీతిలో సర్వే చేయాలనే షరతు విధించింది. ఏఎస్ఐ సర్వేను ఆపాలంటూ జ్ఞానవాపి మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. "చరిత్ర మనకు ఎంతో నేర్పింది. 1992 డిసెంబర్ లో ఏం జరిగింది..? ఆ ఘటన అడుగడుగునా అనుమానం, అపనమ్మకాన్ని పెంచింది" అని మసీదు కమిటీ తరఫు న్యాయవాది హుజెఫా అహ్మదీ అన్నారు. "500 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకునే లక్ష్యంతో ఏఎస్ఐ సర్వేను నిర్వహిస్తున్నారు.. ఇది గత గాయాలను మళ్లీ కొత్తవిగా మారుస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

అయితే ఇప్పుడు గతంలోకి వెళ్లొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సూచించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన వినిపిస్తూ.. "మసీదులో ఎటువంటి తవ్వకాల పని జరగదు. మసీదు లోపల ఏ నిర్మాణానికి ఈ సర్వే హాని కలిగించదు" అని హామీ ఇచ్చారు. మరోవైపు శుక్రవారం ఉదయం ఉదయం 7 గంటలకు మసీదులో ఏఎస్ఐ సర్వే ప్రారంభమైంది. శుక్రవారం ప్రార్థనలకు అనుమతించేందుకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య రెండు గంటల పాటు సర్వేను నిలిపివేశారు. ఈనెల 21లోగా సర్వే నివేదికను వారణాసి జిల్లా కోర్టుకు ఏఎస్ఐ సమర్పించనుంది.


Similar News