కోర్టులు పకడ్బందీగా ఉండాలి..

ఏదైనా కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదులో బాగా జాప్యం జరిగితే.. సాక్ష్యాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని దేశంలోని కోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది.

Update: 2023-09-07 17:11 GMT

న్యూఢిల్లీ : ఏదైనా కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదులో బాగా జాప్యం జరిగితే.. సాక్ష్యాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని దేశంలోని కోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. 1989 నాటి హత్యానేరం కేసులో జీవిత ఖైదు శిక్షపడిన ఇద్దరిని.. నిర్దోషులుగా ప్రకటించే తీర్పును ఇస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ ఇద్దరిని విడుదల చేయాలని ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వ్యక్తిని హత్య చేశారనే అభియోగాలతో ఆ ఇద్దరు వ్యక్తులపై 1989 ఆగస్టు 25న కేసు నమోదైంది. అయితే ఎఫ్ఐఆర్ మాత్రం ఆ మరుసటి రోజున నమోదు చేశారు. ఈ కేసును అప్పట్లో విచారించిన బిలాస్‌పూర్ జిల్లాలోని స్థానిక కోర్టు ఇద్దరిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది.

దీనిపై ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులో అప్పీల్ చేయగా.. 2010 ఫిబ్రవరిలో హైకోర్టు కూడా ట్రయల్‌ కోర్టు తీర్పునే సమర్థించింది. దీంతో వారు సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. హత్యకు నిర్దిష్ట కారణాలేవి తెలియలేదని స్పష్టం చేసింది. కేసుతో ముడిపడిన ముఖ్యమైన అంశాలపై దర్యాప్తు చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేసు ప్రత్యక్ష సాక్షి తన వాంగ్మూలాన్ని మార్చుకున్నాడని, దాంతో వాంగ్మూలం విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారిందని పేర్కొంది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌‌ను కూడా లేట్ గా ఫైల్ చేశారని తెలిపింది.


Similar News