పార్టీని కలిపి ఉంచడానికి సునీతా కేజ్రీవాల్ ఉత్తమ వ్యక్తి: సౌరభ్ భరద్వాజ్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్న నేపథ్యంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని కాపాడటానికి, నాయకులను కలిపి ఉంచడానికి సునీతా కేజ్రీవాల్ ఉత్తమమైన వ్యక్తి అని ఆప్ నాయకుడు, క్యాబినెట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్న నేపథ్యంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని కాపాడటానికి, నాయకులను కలిపి ఉంచడానికి సునీతా కేజ్రీవాల్ ఉత్తమమైన వ్యక్తి అని ఆప్ నాయకుడు, క్యాబినెట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఆయన, సునీతా కేజ్రీవాల్, ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి దూత, ఆమె ఆయన సందేశాలను అందజేస్తున్నారు. ఇది మా పార్టీ క్యాడర్‌పై, మా సానుభూతిపరులపై గొప్ప ప్రభావాన్ని చూపింది. మేము దానిని ప్రచారం చేయాలనుకుంటున్నామని సౌరభ్ అన్నారు. పార్టీ రాజకీయాలు దాని మేనిఫెస్టో చుట్టూ మాత్రమే తిరుగుతాయి, క్యాడర్, అగ్ర నాయకత్వాన్ని కలిపి ఉంచడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీతా కేజ్రీవాల్ ఉనికి క్యాడర్‌పై “సానుకూల ప్రభావం” చూపిందని ఆయన చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో సునీతా కేజ్రీవాల్ పార్టీ తరపున ప్రచారం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఇది జరిగితే మేము చాలా సంతోషిస్తాం, ఆమె ప్రచారంలో పాల్గొనడమనేది ఆమె వ్యక్తిగత నిర్ణయమని సౌరభ్ అన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దీంతో జైలు నుంచి ఆయన ఇస్తున్న సందేశాలను సునీతా కేజ్రీవాల్ పార్టీ నాయకులకు, ప్రజలకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని, అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీ సీఎంగా ఉంటారని కొన్ని ప్రచారాలు కూడా వచ్చాయి. అయితే దీనిపై ఆమె ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేజ్రీవాల్ ప్రస్తుతం జైలు నుంచి పరిపాలన చేస్తున్నారు.