Sukhbir Singh: ఎస్ఏడీ చీఫ్ పదవికి సుఖ్ బీర్ సింగ్ రాజీనామా.. త్వరలోనే కొత్త అధ్యక్షుడి ఎన్నిక

శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు.

Update: 2024-11-16 10:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శిరోమణి అకాలీదళ్ (SAD) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal) తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దల్జీత్ సింగ్ చీమా (Daljith singh Cheema) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘శిరోమణి అకాలీదళ్‌ చీఫ్ సుఖ్‌బీర్‌ సింగ్‌ తన రాజీనామా లేఖను పార్టీ కార్యవర్గానికి శనివారం అందజేశారు. తద్వారా కొత్త అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమం అవుతుంది. బాదల్ నాయకత్వానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. త్వరలోనే నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. ఈ నెల 18న ఎస్ఏడీ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్వీందర్ సింగ్ అధ్యక్షతన నిర్వహించనున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో సుఖ్‌బీర్ రాజీనామాను ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. అయితే బాదల్ రాజీనామాకు గల కారణాలు వెల్లడించలేదు.

లోక్‌సభ ఎన్నికల్లో ఎస్ఏడీ ఓడిపోయిన తర్వాత పార్టీ నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ పర్మీందర్ సింగ్ ధిండా, బీబీ జాగీర్‌తో సహా కొందరు నాయకులు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై తిరుగుబాటు చేశారు. బాదల్ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ సమావేశం కూడా నిర్వహించారు. అంతేగాక ఇటీవల కూడా కొందరు పార్టీ నేతలు బాదల్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అప్పుడు ఈ కథనాలను పార్టీ తోసిపుచ్చింది. సుఖ్‌బీర్ సింగ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నామని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే బాదల్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. పంజాబ్ లో ఉప ఎన్నికల వేళ బాదల్ రిజైన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News