Priyanka Gandhi Vadra: ‘బీజేపీ భయపడుతోంది..’ కాషాయ పార్టీపై నిప్పుల చెరిగిన ప్రియాంకా గాంధీ
బీజేపీ భయపడుతోందని, అందుకే అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ భయపడుతోందని, అందుకే అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (శనివారం) షిర్డీలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ఆమె.. బీజేపీపై మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతోందని, కానీ ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహస్యం చేసింది ఎవరు.? అని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు అని రాజ్యాంగం చెబుతోందని, ఆ ఓటు హక్కుతోనే వాళ్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, కానీ మహారాష్ట్రలో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. ‘ఇక్కడ మొదట ప్రజలు ప్రభుత్వం ఎన్నుకున్నారు. ఆ తర్వాత డబ్బుతో, భయపెట్టి, బెదిరించి, ఏజెన్సీలను ఉపయోగించి ఆ ప్రభుత్వాన్ని దించేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన పార్టీ బీజేపీ మహారాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతుల పంటలకు ధర లభించడం లేదు. యువతకు ఉపాధి లభించడం లేదు. మహిళలకు రక్షణ కరువైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం దొరకడం లేదు’ అంటూ ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు.
అంతేకాకుండా రాహుల్ గాంధీపై బీజేపీ చేస్తున్న ఆరోపణలుకు కూడా ప్రియాంక గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని బీజేపీ వాళ్లు అంటున్నారని, కానీ రాహుల్ గాంధీ న్యాయం కోసం మణిపుర్ నుంచి ముంబై వరకు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని, కులగణన కోసం ప్రతి చోటా నినదించారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని తాను ఒక్కటే అడుగుతున్నానని, ఏ కులం వాళ్లు ఎంతమంది ఉన్నారో తెలియకుండా.. కుల రిజర్వేషన్లు కల్పించడం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.