2,200 ఉద్యోగాలకు కోసం ఎగబడిన 25 వేల మంది యువకులు

ఎయిర్ ఇండియా నిర్వహించిన ఇంటర్వ్యూలో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది.

Update: 2024-07-17 06:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు పక్కన పెడితే ప్రైవేట్ సెక్టార్ లోనూ ఉపాధి దొరకడం కష్టతరంగా మారుతున్నది. ఇది నిజమని నిరూపించేందుకు ఇటీవల అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ముంబయిలో ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు వేలాది మంది అభ్యర్థులు తరలి రావడం ఒక్కసారిగా గందరగోళానికి దారితీసింది. 2200 లోడర్, ఇతర పోస్టుల కోసం ప్రకటన ఇవ్వగా దాదాపు 25 వేల నుంచి 50 వేల మంది వరకు ఆశావహులు తమ సర్టిఫికెట్లు పట్టుకుని ఉద్యోగం నిమిత్తం హాజరయ్యారు. తమ రెజ్యూమ్ ను అధికారులకు అందజేసేందుకు నీరు, ఆహారం తీసుకోకుండా గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఒక దశలో తొక్కిసలాట వంటి పరిస్థితులకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురు అభ్యర్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కిలోమీటర్ల మేర అభ్యర్థులు క్యూ కట్టడంతో వారిని కంట్రోల్ చేయలేక ఎయిర్ ఇండియా సిబ్బంది తలలు పట్టుకున్నారు. చివరకు పోలీసులను పిలిపించి ఆ క్రౌడ్ ను కంట్రోల్ చేయాల్సి వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా ఇటీవలే గుజరాత్ లోని భరూచ్ జిల్లా అంకలేశ్వర్ సిటీలో ఓ కంపెనీలో 10 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన ఇస్తే వేలాది మంది యువకులు ఇంటర్వ్యూకు తరలి రావడం హాట్ టాపిక్ అయింది. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ఇటువంటి వీడియోలే సాక్ష్యం అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఇంటర్వ్యూకు పిలిచిన కంపెనీలు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని దీంతో అమాయకులైన యువకులకు ప్రమాదకరంగా మారుతున్నాయని నెటిజన్లసు కామెంట్స్ చేస్తున్నారు. 


Similar News