Sri Lanka: 8 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
చేపల వేట కోసం వెళ్లిన ఎనిమిది మంది భారత జాలర్లను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: చేపల వేట కోసం వెళ్లిన ఎనిమిది మంది భారత జాలర్లను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. జాలర్లు తెల్లవారుజామున తమిళనాడులోని రామేశ్వరం నుంచి బయలుదేరి ధనుష్కోడి, తలైమన్నార్ ప్రాంతంలో చేపలు పడుతుండగా, శ్రీలంక నేవీ పెట్రోల్ బోట్లు వారిని చుట్టుముట్టి, ఎనిమిది మంది జాలర్లను అరెస్టు చేసి, పడవను స్వాధీనం చేసుకున్నాయి. అరెస్టు చేసిన జాలర్లను మన్నార్ మత్స్యశాఖ అధికారులకు అప్పగించనున్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దాటినందుకే వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్ట్‌ను రామేశ్వరం ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ ధృవీకరించారు.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటుతున్నారనే నెపంతో 72 రోజుల్లో శ్రీలంక నావికాదళం దాదాపు 163 మంది జాలర్లను అరెస్టు చేసింది. అయితే ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన చర్చల అనంతరం వారిని విడతల వారీగా విడుదల చేస్తున్నారు. మరోవైపు జాలర్లు ఈ అరెస్ట్‌లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపల వేటకు వెళ్లిన ప్రతిసారి అరెస్ట్ చేయడం వలన తమిళనాడులోని రామనాథపురం, నాగపట్నం, పుదుకోట్టైలోని మత్స్య పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, శ్రీలంక, భారత్‌ల మధ్య దౌత్యపరమైన చర్చల ద్వారా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.