కోటాలో మరో విద్యార్థి బలవన్మరణం

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ)కి ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2024-03-08 15:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని కోటాలో పరీక్షల ఒత్తిడికి మరో విద్యార్థి బలయ్యాడు. ఈ ఈఏడాది కోటాలో విద్యార్థుల బలవన్మరణాల్లో ఇది ఆరో ఘటన, దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి గురించి ఆందోళన మరింత పెరిగింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ)కి ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన అభిషేక్ కుమార్ కోటాలోని విజ్ఞాన్ నగర్‌లో అద్దెకు ఉంటున్న గదిలోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. విద్యార్థి తన తండ్రికి లేఖను కూడా రాశాడని, 'సారీ నాన్న.. నేను జేఈఈ పూర్తి చేయలేను' అని లేఖలో ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 29, ఫిబ్రవరి 19 తేదీల్లో కోచింగ్ సెంటర్‌లో జరిగిన రెండు పరీక్షలకు అభిషేక్ హాజరు కాలేదని తెలుస్తోంది. పోస్ట్‌మార్టం నిర్వహించి, విద్యార్థి మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అందజేస్తామని పోలీసులు పేర్కొన్నారు. కాగా, కోటాలో గతకొన్ని నెలలుగా విద్యార్థుల ఆత్మహత్య కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు కౌన్సిలింగ్ కోసం సౌకర్యాలు పెంచడం, విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆత్మహత్యలు ఆగటంలేదు. 2023లోనే మొత్తం 26 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఏడాదిలోనూ ఘటనలు కొనసాగడంతో ఇటీవల కేంద్రం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.  


Similar News