త్వరలో ప్రధాని మోడీ మరో గుడ్ న్యూస్!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త పథకాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పీడ్ పెంచారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రధాని కసరత్తు మొదలు పెట్టారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త పథకాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పీడ్ పెంచారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రధాని కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయా పథకాల విధివిధానాలు, అమలు గురించి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాతో పాటు పలువురు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని పేద, మధ్య తరగతి వర్గాలకు సొంతిల్లు కల సాకారం చేసే దిశగా వారికి బ్యాంకుల్లో రుణాల్లో ఉపశమనం కలిగించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతున్నదని ప్రకటించారు.
అలాగే విశ్వకర్మ యోజన పథకాన్ని అనౌన్స్ చేశారు. చెప్పినట్లుగానే విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా ఇవాళ జరిగిన మీటింగ్‌లో పేదవారికి ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పథకంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఎన్నికలవేళ ఇండియా కూటమి కొత్త హామీలతో మోడీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని ప్రతిపాదనలతో వస్తుండటంతో నేరుగా ప్రధాని యాక్షన్‌లోకి దిగడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నదనే ఉత్కంఠ పెరుగుతోంది.