Sonia gandhi: మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తోంది.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ (Sonia Gandhi) ఆరోపించారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక ప్రణాళికా ప్రకారం దానిని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ చట్టానికి బడ్జెట్ కేటాయింపులు నిరంతరం తగ్గిస్తోందని తెలిపారు. మంగళవారం రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా మాట్లాడిన సోనియా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏకు నిధులు తగ్గించడం ద్వారా ఈ స్కీమ్‌ను క్రమపద్దతిలో అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. చాలా కాలంగా ఈ పథకానికి కేవలం రూ.86వేల కోట్లు మాత్రమే కేటాయించారని, దాని బడ్జెట్ రూ.4000 కోట్లు తగ్గించారని తెలిపారు. అంతేగాక ప్రస్తుత కేటాయింపుల్లో దాదాపు 20 శాతం నిధులు గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను క్లియర్ చేయడానికే ఉపయోగించారని వివరించారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan singh) నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎంఎన్‌ఆర్‌ఈజీఏ చట్టం గ్రామీణ భారతదేశానికి రక్షణ కవచంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఈ చట్టం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతన చెల్లింపులు, వేతన రేట్లలో తరచుగా జరిగే జాప్యాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి కూడా సరిపోవన్నారు. పథకాన్ని కొనసాగించడానికి బడ్జెట్ కేటాయింపులను పెంచాలని, సకాలంలో కూలీలకు డబ్బులు చెల్లించడంతో పాటు రోజువారీ కనీస వేతనాన్ని రూ.400కు పెంచాలని డిమాండ్ చేశారు. తప్పనిసరి ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను, నేషనల్ మొబైల్ మానిటరింగ్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. పనిదినాలను సైతం 100 నుంచి 150కి పెంచాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థిక భద్రతను అందించడానికి ఈ చర్యలు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.