సీతారాం ఏచూరి చివరి పొలిటికల్ కామెంట్ ఇదే!

సీపీఎం (భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు, CPIM) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) (72) కన్నుమూశారు.

Update: 2024-09-12 11:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీపీఎం (భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు, CPIM) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) (72) కన్నుమూశారు. గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్(AIIMS, Delhi) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఆగస్టు 17న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయనను ఆ తర్వాత ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)కు తరలించారు. అప్పటి నుంచి ఏడుగురు వైద్య నిపుణుల బృందం ట్రీట్‌మెంట్ అందించింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయనకు వెంటిలేటర్ అమర్చినట్లు ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. పరిస్థితి విషమించి ఇవాళ కన్నుమూశారు.

అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరడానికి ముందు 42 మంది సివిల్ సర్వెంట్లను లేటెరల్ ఎంట్రీ పద్ధతిలో ప్రభుత్వంలో చేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్ చేశారు. వివిధ మంత్రిత్వశాఖల్లో జాయింట్ సెక్రెటరీ, డిప్యూటీ సెక్రెటరీ, డైరెక్టర్ పోస్టుల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తుల్ని నియమించడానికే ప్రధాని మోడీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారంటూ తప్పుపట్టారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో ప్రభుత్వ విధానాలపైనా, దేశంలో చోటుచేసుకున్న పరిణామాలపైనా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేకపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన సీతారం ఏచూరి.. 1974లో ఎస్ఎఫ్ఐ (సీపీఎం విద్యార్థి విభాగం) కార్యకర్తగా చేరారు. మరుసటి సంవత్సరంలోనే సీపీఎం పూర్తికాలం కార్యకర్తగా మారారు. ఆ తర్వాతి సంవత్సరమే ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయ్యారు. ఢిల్లీలోనే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) విద్యార్థి విభాగానికి ఒక్క సంవత్సరం (1977-78)లోనే మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ యూనివర్శిటీలో వామపక్ష భావజాలాన్ని విస్తృతం చేయడంలో ఆ సమయంలో ఆయన కీలక భూమిక పోషించారు.


Similar News