సిద్ధ వర్సెస్ డీకే.. సీఎం కుర్చీ కోసం ముదిరిన వార్!
కర్ణాటక సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై ఓ వైపు అధిష్టానం చర్చలు జరుపుతుంటే మరో వైపు పదవి కోసం ఇటు సిద్ధ రామయ్య అటు డీకే శివకుమార్ ఇరువురు లాబీయింగ్ ప్రయత్నాలు కర్ణాటక రాజకీయాన్ని మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఈ క్రమంలో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా తన నివాసంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన డీకే.. పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని అన్నారు. తాను ఒంటరిగా నిలిచానని, ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానన్నారు.
సిద్ద రామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. సోనియా గాంధీ ఇచ్చిన బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నెరవేర్చానని అన్నారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో సోనియా, రాహుల్, ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటాని భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం పదవి ఎవరికి అనే విషయాన్ని మాత్రం ఆయన అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. అయితే మీడియాతో మాట్లాడే సమయంలో కాస్త అసంతృప్తి, ఉద్వేగంతో కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎమ్మెల్యేల మద్దతు తనకే: సిద్దరామయ్య
సీఎం పదవి విషయంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు తానే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన బలాన్ని ఎవరూ తీసివేయలేరని, కర్ణాటక ప్రజలు అవినీతి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఓడించారన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి నిష్క్రమించినప్పటికీ నేను కాంగ్రెస్ ను విక్టరీ దిశగా నడిపినట్లు చెప్పారు. తాను సీఎం అవుతాననే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
మరో రాజస్థాన్‌గా కర్ణాటక..?
సీఎం పదవి విషయంలో కర్ణాటక కాంగ్రెస్‌లో హైడ్రామా నడుస్తోంది. ఈ సమస్యకు అధిష్టానం ఓ శాంతియుతమైన పరిష్కారం చూపకపోతే కర్ణాటక కాంగ్రెస్ పరిస్థితి మరో రాజస్థాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పీఠం కోసం సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వార్ నివురు గప్పిన నిప్పులా మారింది. ఏ క్షణంలో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. సందర్భం వచ్చిన ప్రతి సారి ఈ ఇరు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో సిద్ద రామయ్య వర్సెస్ డీకే శివకుమార్‌కు మధ్య సీఎం కుర్చీ కొట్లాట కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనేది ఆసక్తిగా మారింది.
Also Read..