హర్యానాలో బీజేపీకి షాక్: కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ బిజేంద్ర సింగ్

హర్యానాలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బిజేంద్ర సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో

Update: 2024-03-10 09:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బిజేంద్ర సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. బలవంతపు రాజకీయ కారణాల వల్ల బీజేపీని వీడినట్టు బిజేంద్ర సింగ్ తెలిపారు. ‘హిసార్ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఇచ్చిన బీజేపీకి కృతజ్ఞతలు. కానీ నేను పార్టీలో సంతోషంగా లేను. రైతుల పట్ల నిర్లక్ష్యం, రెజర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనందుకు అసంతృప్తికి లోనయ్యా’ అని చెప్పారు. రాజకీయాల్లో పనిచేపే సంకల్పం కొనసాగుతుందని తెలిపారు. లోక్ సభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేసినట్టు స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, దీపక్ బబారియాలు బిజేంద్ర సింగ్‌ను పార్టీలోని ఆహ్వానించారు.

కాగా, బిజేంద్ర సింగ్ మాజీ ఐఏఎస్ అధికారి. స్వచ్చంద పదవీ విరమణ అనంతరం ఆయన 2019లో బీజేపీలో చేరి హర్యానాలోని హిసార్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన తల్లి ప్రేమ్ లత కూడా హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతేడాది బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ నిరసన తెలిపిన రెజ్లర్లరు బహింరంగంగా మద్దతు తెలిపారు. హిసార్ నుంచి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బిజేంద్ర సింగ్ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తాకినట్టు అయింది.

Tags:    

Similar News