Tihar Jail : ఢిల్లీ నుంచి తీహార్ జైలు తరలింపు
ఆసియాలోనే అతిపెద్ద తీహార్ జైలు(Tihar Jail)ను మరోచోటుకు తరలించేందుకు ఢిల్లీ(Delhi) ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆసియాలోనే అతిపెద్ద తీహార్ జైలు(Tihar Jail)ను మరోచోటుకు తరలించేందుకు ఢిల్లీ(Delhi) ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఢిల్లీ శివారులో మరింత విశాలంగా మరో జైలును నిర్మించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఢిల్లీ సీఎం రేఖాగుప్తా(CM Rekhagupta) అధికారిక ప్రకటన చేశారు. జైలులో ఉంచే ఖైదీల రద్దీ, జైలు చుట్టుపక్కల నివసించే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తీహార్ జైలు భారతదేశంలోని అతిపెద్ద జైళ్ల సముదాయాల్లో ఒకటిగా, ఢిల్లీలోని పశ్చిమ జనక్‌పురి ప్రాంతంలో తీహార్ గ్రామం సమీపంలో 400 ఎకరాల్లో 1958లో ఏర్పాటు చేశారు.
తీహార్ జైలు దాని సామర్థ్యాన్ని మించి ఖైదీలతో నిండి ఉండటం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర రద్దీ సమస్యను ఎదుర్కొంటోంది. దీని సామర్థ్యం 10,026 మంది ఖైదీలకు మాత్రమే అయినప్పటికీ, ప్రస్తుతం దాదాపు 19,500 మంది ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రద్దీని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మండోలీ జైలు సముదాయాన్ని నిర్మించింది. నరేలా, బాప్రోలా ప్రాంతాల్లో కొత్త జైళ్లను నిర్మించే ప్రతిపాదనలు ఉండగా.. తాజాగా తీహార్ జైలునే వేరే చోటుకి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.