కర్ణాటకలో విజయంతో సంతృప్తి చెందొద్దు.. కాంగ్రెస్‌కు సీనియర్ నేత హితవు

కర్ణాటకలో సాధించిన విజయాన్ని చూసి కాంగ్రెస్ సంతృప్తి చెందకూడదని.. ఎందుకంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటర్ల ప్రవర్తనలో తేడాలు ఉండొచ్చని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు.

Update: 2023-06-16 14:49 GMT

వల్లాడోలిడ్ (స్పెయిన్) : కర్ణాటకలో సాధించిన విజయాన్ని చూసి కాంగ్రెస్ సంతృప్తి చెందకూడదని.. ఎందుకంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటర్ల ప్రవర్తనలో తేడాలు ఉండొచ్చని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు. స్పెయిన్‌లోని వల్లాడోలిడ్‌లో నిర్వహించిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన.. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "2018లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించినప్పటికీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పేలవమైన ఫలితాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ లెక్కన కొన్ని నెలల వ్యవధిలోనే ఓటర్ల అభిప్రాయం ఏ విధంగానైనా మారిపోవచ్చు" అని థరూర్ పేర్కొన్నారు.

"ఒక రాష్ట్రంలో పనిచేసిన ఫార్ములా.. జాతీయ స్థాయిలో పనిచేస్తుందని భావించలేం" అని ఆయన కామెంట్ చేశారు. బలమైన, సమర్థవంతమైన స్థానిక నాయకత్వం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. "కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక వైఖరి ఉంటుంది. అందుకే నేను అధ్యక్ష పదవికి పోటీ చేయగలిగాను. నేను అధ్యక్ష పదవికి పోటీ చేయడం పార్టీని మరింత బలోపేతం చేసిందని సోనియా గాంధీ నాతో అప్పట్లో అన్నారు. ఆమె మాటకు నేను కట్టుబడి ఉంటా’’ అని శశిథరూర్ చెప్పారు.


Similar News