న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ సెక్రెటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసిన మరుసటి రోజు(శనివారం) ఆయన మీడియతో మాట్లాడుతూ, ‘నాపై జీవితాంతం అనర్హత వేటు వేసినా, జైల్లో పెట్టినా క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు. ఎందుకంటే నా పేరు సావర్కర్ కాదు.. గాంధీ. గాంధీ ఎవ్వరినీ క్షమించమని అడగబోడు’ అంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై ఉద్ధవ్ థాక్రే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య రక్షణకు మోడీ సర్కార్‌పై కలిసి పోరాడుదామని, కానీ, సావర్కర్‌ను అవమానిస్తే మాత్రం సహించేదిలేదని సోమవారం తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్)తో కలిసి ఏర్పడిన మహారాష్ట్ర వికాస్ అఘాడి(ఎంవీఏ) కూటమిలో విభేదాలు వచ్చాయి. సోమవారం నాటి ప్రతిపక్షాల నిరసన ర్యాలీలో ఉద్ధవ్ పార్టీ పాల్గొన్నప్పటికీ, ఆ తర్వాత ఖర్గే నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైంది. దీంతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్, ఉద్ధవ్ పార్టీల మధ్య సయోధ్యకు యత్నించారు.
‘నిజమైన సమస్యలపై దృష్టిపెడదాం’..
ఈ క్రమంలోనే, సోమవారం నాటి నిరసన ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశంలో సావర్కర్ అంశంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో శరద్ పవార్ చర్చించారు. మహారాష్ట్ర ప్రజలు సావర్కర్‌ను ఆరాధిస్తుంటారని, ఆయనను విమరిస్తే అక్కడి ఎంవీఏ కూటమికి నష్టమే తప్ప, లాభం ఉండదని తెలిపారు. ఈ సమావేశంలో సోనియా, రాహుల్ సైతం పాల్గొనగా, సావర్కర్ విషయంలో కొంచెం తగ్గాలని సూచించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
విపక్షాల పోరాటం ప్రధాని మోడీతోనే ఉండాలే తప్ప, సావర్కర్‌తో కాదని రాహుల్‌కు హితవు పలికినట్టు తెలుస్తోంది. కాబట్టి, సావర్కర్ గురించి మాట్లాడటం ఆపేయాలని రాహుల్‌కు సూచించినట్టు సమాచారం. ‘మనం ప్రజాస్వామ్య సమస్యలపైనే దృష్టిపెట్టాలి. వివాదాలు సమస్య నుంచి దృష్టి మళ్లిస్తాయి. భావోద్వేగ సమస్యలపై మాట్లాడకుండా, నిజమైన సమస్యలకు కట్టుబడి ఉండాలి’ అని రాహుల్, సోనియాతో తెలిపినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. శరద్ పవార్ సూచనలకు సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్.. సావర్కర్ విషయంలో కాస్త వెనక్కి తగ్గేందుకు అంగీకరించిందని తెలిపింది.