Sewa pakhwara: మోడీ జన్మదినం సందర్భంగా ‘సేవా పఖ్వారా’.. పలు కార్యక్రమాలు చేపట్టనున్న బీజేపీ

17 నుంచి అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి వరకు ‘సేవా పఖ్వారా’ పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపింది.

Update: 2024-09-09 15:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి వరకు ‘సేవా పఖ్వారా’ పేరుతో దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా పారా ఒలంపిక్ క్రీడాకారులను సన్మానించడంతో పాటు రక్తదానం, వికలాంగులకు సహాయక పరికరాల పంపిణీ సహా పలు కార్యక్రమాలు చేపట్టనుంది. అలాగే హెల్త్ క్యాంపులు సైతం నిర్వహించనుంది. ఈ నెల 17న అన్ని జిల్లాల్లో రక్తదాన శిబిరాలు, 28 నుంచి 24వరకు అన్ని పాఠశాలలు, ఆస్పత్రుల ప్రాంగణాలకు రంగులు వేయడంతో పాటు అవసరమైన సామగ్రిని విరాళంగా అందించనుంది.

23న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధ మహిళలకు ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ప్రధాని మోడీ వ్యక్తిత్వం, విజయాలపై ఎగ్జిబిషన్ సైతం నిర్వహించనుంది. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ ప్రజా ప్రతినిధులు చురుకుగా పాల్గొనాలని సూచించింది. ప్రజాసేవ, సామాజిక సంక్షేమం, జాతీయ ఐక్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని బీజేపీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీని కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ స్థాయిలో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్‌ను సమన్వయకర్తగా నియమించారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు సరోజ్ పాండే, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా, సమీర్ ఒరాన్, హరీష్ ద్వివేది, రాజీవ్ చంద్రశేఖర్, నీరజ్ శేఖర్, అపరాజిత సారంగి బృందంలో సభ్యులుగా ఉన్నారు.


Similar News