Karnataka: మగవారికి ప్రతివారం 2 సీసాల మద్యం ఉచితంగా ఇవ్వాలి: కర్ణాటక ఎమ్మెల్యే
ఏడాది కాలంలో ప్రభుత్వం మూడుసార్లు ఎక్సైజ్ పన్నులను పెంచింది.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక శాసనసభలో మంగళవారం ఎమ్మెల్యేలు ఆసక్తికర చర్చ జరిపారు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని రూ. 40,000 కోట్లకు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 36,500 కోట్లుగానే ఉంది. అయితే, మద్యం నుంచి ఆదాయాన్ని పెంచుకోవాలనుకునే ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విపక్ష ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. ఓ సీనియర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మద్యం సేవించే మగవాళ్లకు ప్రతి వారం రెండు మద్యం సీసాలు ఉచితంగా ఇవ్వాలని కోరగా, మరొక ఎమ్మెల్యే రాష్ట్రంలో సంపూర్ణ నిషేధం విధించాలన్నారు. ' ఏడాది కాలంలో ప్రభుత్వం మూడుసార్లు ఎక్సైజ్ పన్నులను పెంచింది. ప్రజలు మద్యం మానేయాలని ఆశించలేం. ముఖ్యంగా చిన్నాచితక పనులు చేసుకునే కార్మికులు మద్యం అలవాటును మానుకోలేరు. ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు నెలనెలా రూ. 2,000 ఇస్తోంది. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం అందిస్తోంది. అవన్నీ ప్రజల డబ్బుతోనే కొనసాగుతున్న పథకాలు. అలాంటప్పుడు తాగేవారికి ప్రతి వారం రెండు మద్యం సీసాలను ప్రభుత్వం ఉచితంగా ఎందుకివ్వకూడదని జేడీ(ఎస్) సీనియర్ ఎమ్మెల్యే ఎంటీ క్రిష్ణప్ప ప్రశ్నించారు. మగవాళ్లకు కూడా ఏదొకటి ఇవ్వండి. ప్రభుత్వమే సొసైటీల ద్వారా వారానికి రెండు సీసాలు ఇవ్వండి అని క్రిష్ణప్ప తెలిపారు.
దీనికి బదులిచ్చిన ఇంధన మంత్రి కె జె జార్జ్, మీరు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ పనేదో మీరే చేయండని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజలు తక్కువ తాగేలా చేస్తున్నదని అన్నారు. ఇదే అంశంపై మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్, రాష్ట్రంలో మద్య నిషేధం విధించాలని కోరారు. ఎక్సైజ్ ఆదాయం పేదల నుంచి పీల్చిన రక్తం. ఆ డబ్బు దేశాన్ని నిర్మించదని అన్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా మద్య నిషేధాన్ని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయంపై ఆధారపడుతోందని ప్రతిపక్ష నేత అరవింద్ బెలాడ్ అభిప్రాయపడ్డారు.