కుంభకోణాలు బయటపెట్టిన కలం యోధుడు.. శంతను గుహ ఇక లేరు
దిశ, నేషనల్ బ్యూరో : సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, రచయిత శంతను గుహ రే సోమవారం కన్నుమూశారు.
దిశ, నేషనల్ బ్యూరో : సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, రచయిత శంతను గుహ రే సోమవారం కన్నుమూశారు. 25 సంవత్సరాల జర్నలిజం కెరీర్‌లో ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను గెల్చుకున్న ఆయన మరణవార్త తెలుసుకొని జర్నలిస్టు వర్గాలు ప్రగాఢ సంతాపం తెలిపాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణంపై 2011 సంవత్సరంలో ఆయన రాసిన పరిశోధనాత్మక కథనాలు సంచలనం క్రియేట్ చేశాయి. అనంతరం కాగ్ రిపోర్టులోనూ బొగ్గు కుంభకోణం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఆనాడు యూపీఏ సర్కారు ప్రతిష్ఠను మసకబార్చిన కుంభకోణాల్లో అది ఒకటి. ఇక అప్పట్లో భూముల లీజుకు సంబంధించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జీఎంఆర్ నేతృత్వంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందంలోని అక్రమాలను వార్తలతో బయటపెట్టింది మరెవరో కాదు..శంతను గుహ !! క్రికెట్ విశ్లేషణలను అద్భుతంగా రాసినందుకు ఆయనకు రామ్‌నాథ్ గోయెంకా అవార్డు లభించింది. మన దేశంలో గర్భాశయ క్యాన్సర్ మరణాల సమాచారంతో విశ్లేషణాత్మక కథనాలు రాసినందుకు లాడ్లీ మీడియా అవార్డు, నీటి సంబంధిత సమస్యలపై కథనాలు రాసినందుకు ‘వాష్’ అవార్డు కూడా శంతను గుహకు లభించాయి. ఆయన ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, ది వార్టన్ స్కూల్ పూర్వ విద్యార్థి. సెంట్రల్ యూరోపియన్ న్యూస్‌లో ఆసియా ఎడిటర్‌గానూ పనిచేశారు.