మసీదులో సైంటిఫిక్ సర్వేపై సుప్రీంకోర్టు స్టే..

కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదులో సైంటిఫిక్ సర్వే చేయాలంటూ వారణాసి జిల్లా కోర్టు జులై 21న ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Update: 2023-07-24 12:14 GMT

వారణాసి(యూపీ) : కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదులో సైంటిఫిక్ సర్వే చేయాలంటూ వారణాసి జిల్లా కోర్టు జులై 21న ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జులై 26న సాయంని త్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి సర్వే చేపట్టరాదని ఆదేశించింది. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు శాస్త్రీయ సర్వే చేసేందుకు భారత పురావస్తు విభాగం(ఏఎస్ఐ) అధికారుల బృందం సోమవారం ఉదయం 7 గంటలకు జ్ఞానవాపి మసీదులోకి వెళ్ళింది. ఈ సర్వేను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉదయం అత్యవసరంగా విచారించింది. "సర్వే సమయంలో మసీదు ప్రాంగణంలో పురావస్తు అధికారులు తవ్వకాలు చేపడతారా?" అని విచారణ సందర్భంగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

దీనికి కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా బదులిస్తూ.. ‘‘ఒక్క ఇటుకనూ జరపడం లేదు. అలాంటి ప్రణాళిక లేదు. ప్రస్తుతానికి అక్కడ కేవలం కొలతలు, ఫొటోగ్రఫీ, రాడార్‌ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోంది. ఇది మసీదు నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం చూపించదు’’ అని కోర్టుకు తెలిపారు. మసీదు ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపు లేదా తవ్వకాలు చేపట్టట్లేదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం.. వారణాసి కోర్టు ఇచ్చిన మసీదు సర్వే ఆదేశాలపై స్టే విధించింది. వారణాసి కోర్టు ఆదేశాలపై మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. మొగలుల పాలనా కాలంలో హిందూ ఆలయం స్థానంలో ఈ మసీదు నిర్మితమైందని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి నిర్ధారించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని జులై 21న తీర్పు ఇచ్చింది.


Similar News