Kolkata doctor case: నేనేం తప్పు చేయలేదు.. వైద్య విద్యార్థిని మృతదేహాన్ని చూశా అంతే!

కోల్‌కతా హత్యాచారం కేసులో తానేం తప్పుచేయలేదని నిందితుడు సంజయ్ రాయ్ వెల్లడించారు.

Update: 2024-09-02 05:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా హత్యాచారం కేసులో తానేం తప్పుచేయలేదని నిందితుడు సంజయ్ రాయ్ వెల్లడించారు. సంజయ్ రాయ్ తన న్యాయవాది కవితా సర్కార్‌కు తాను నిర్దోషినని, తనని ఇరికిస్తున్నారని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంజయ్ రాయ్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లోకి ప్రవేశించినప్పుడు ట్రైనీ డాక్టర్ అపస్మారక స్థితిలో ఉందని పాలిగ్రాఫ్ పరీక్షలో పేర్కొన్నట్లు ఆ నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు 9న సెమినార్ హాల్ లో రక్తపుమడుగులో ట్రైనీ డాక్టర్ కన్పించిందని ఆయన చెప్పాడని సమాచారం. భయంతో గది నుండి బయటకు పరుగెత్తినట్లు తెలిపాడని తెలుస్తోంది. తనకు మృతురాలు తెలియదని.. కావాలనే బలవంతంగా తనని ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆయన తెలుపుతున్నాడు. అయితే, తాను నిర్దోషి అయితే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని రాయ్ ప్రశ్నించగా.. ఎవరూ నమ్మరని భయపడ్డానని చెప్పాడని అన్నారు.

న్యాయవాది కవితా సర్కార్ ఏమన్నారంటే?

ఇకపోతే, అతని న్యాయవాది కవితా సర్కార్ పాలిగ్రాఫ్ నివేదికలో వెల్లడైన తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్ష సమయంలోనూ నిర్దోషి అనే తేలిందని పేర్కొన్నారు. దోషి మరెవరో అయి ఉండవచ్చని కవితా సర్కార్ అన్నారు. "అతను సెమినార్ హాల్‌కి అంత సులభంగా యాక్సెస్ కలిగి ఉంటే, ఆ రాత్రి భద్రతా లోపం ఉందని.. మరొకరు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు" అని ఆమె జాతీయ మీడియాకు తెలిపారు. కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. హత్య జరిగిన ప్రాంతమైన సెమినార్ హాల్ లోపల అతని బ్లూటూత్ హెడ్‌సెట్ ని అధికారులు గుర్తించారు. దీని ఆధారంగానే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.


Similar News