Sanjay Gaikwad: రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11లక్షలు ఇస్తా.. షిండే శివసేన నేత వివాదాస్పద వ్యాఖ్యలు

రాహుల్ గాంధీపై మహారాష్ట్ర బుల్దానా ఎమ్మెల్యే, షిండే శివసేన నేత సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-16 15:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాహుల్ గాంధీపై మహారాష్ట్ర బుల్దానా ఎమ్మెల్యే, షిండే శివసేన నేత సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించారు. సోమవారం ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. ‘భారతదేశంలో రిజర్వేషన్లను అంతం చేయడంపై రాహుల్ చేసిన ప్రకటన సరికాదు. మహారాష్ట్రతో పాటు దేశంలోనూ రిజర్వేషన్ల డిమాండ్ విపిపిస్తోంది. పలువురు ఈ అంశంపై ఇప్పటికే నిరసనలు తెలుపుతున్నారు. వెనుకబడిన తరగతులు, గిరిజనులు, ఇతరులకు అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారు. కానీ రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి దేశంలో రిజర్వేషన్లను అంతం చేయాలని మాట్లాడుతున్నారు. ఈ ప్రకటనతో అతని నిజస్వరూపం బయటపడింది. రాహుల్ గాంధీ నాలుకను ఎవరు కోసేస్తే వారికి రూ.11 లక్షల బహుమతి ఇస్తా’ అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల అనంతరం మహారాష్ట్రలో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. సంజయ్ గైక్వాడ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే గైక్వాడ్ వ్యాఖ్యలకు తాను మద్దతివ్వడం లేదని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే తెలిపారు. ఆయన కామెంట్స్‌ను సమర్థించబోనని వెల్లడించారు. కాగా, రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా మాట్లాడుతూ.. దేశంలో అందరికీ సమాన అవకాశాలు లభించడం ప్రారంభించినప్పుడే రిజర్వేషన్లను ముగించాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందని, ప్రస్తుతం భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఈ ప్రకటనపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. 


Similar News