'రూ.20 లక్షల కుంభకోణం గ్యారెంటీ'.. విపక్షాల మీటింగ్‌పై ప్రధాని సెటైర్లు

పాట్నా వేదికగా ఇటీవల(ఈ నెల 23న) జరిగిన విపక్షాల సమావేశంపై ప్రధాని మోడీ సెటైర్లు వేశారు.

Update: 2023-06-27 14:58 GMT

భోపాల్: పాట్నా వేదికగా ఇటీవల(ఈ నెల 23న) జరిగిన విపక్షాల సమావేశంపై ప్రధాని మోడీ సెటైర్లు వేశారు. మధ్యప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ నేతలనుద్దేశించి ప్రసంగిస్తూ, ‘ఈ మధ్య హామీ అనే పదం తరచూ వినిపిస్తోంది. విపక్ష పార్టీలన్నీ అవినీతి, కోట్ల విలువైన కుంభకోణాలకు హామీలిచ్చినవే. ఇటీవలే వారు ఓ ఫొటో సెషన్(విపక్షాల మీటింగ్‌ను ఉద్దేశించి) నిర్వహించుకున్నారు. ఆ ఫొటోలో ఉన్నవారంతా రూ.20లక్షల కోట్ల కుంభకోణాలకు హామీలిచ్చారు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే రూ.లక్ష కోట్ల విలువైన స్కాంలకు పాల్పడింది’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఆ పార్టీలన్నింటికీ కుంభకోణాల్లోనే అనుభవం ఉందని, కాబట్టి వారు అవినీతికి సంబంధించిన హామీలు మాత్రమే ఇవ్వగలరని వెల్లడించారు.

ఆ హామీలను అంగీకరించాలా..? వద్దా అనేది దేశ ప్రజలే నిర్ణయించాలని అన్నారు. ఇక్కడ మోడీ హామీ కూడా ఒకటుందని, అదే ప్రతి అవినీతిపరుడిపై చర్యలు తీసుకునే హామీ అని ప్రధాని తెలిపారు. ‘ఇప్పటివరకు పరస్పరం తిట్టుకున్న ఆ పార్టీలు.. ఇకపై పరస్పరం కాళ్లపై పడాలనుకుంటున్నాయి. ఇది వారి నిస్సహాయతకు నిదర్శనం. అలాంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయొద్దు. జాలి చూపించండి’ అంటూ బీజేపీ నేతలకు సూచించారు. అంతకన్నా ముందు ఐదు వందేభారత్‌ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. వీటిలో రెండు రైళ్లు మధ్యప్రదేశ్‌లో నడవనుండగా, మిగతావి కర్ణాటక, బిహార్‌, గోవాలలో అందుబాటులోకి వచ్చాయి.


Similar News