భారత్‌కు ఉగ్రవాది ఆల్టిమేటం
భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఈ మధ్య కాలంలో రకరకాల వార్నింగ్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఖలిస్థానీ (Khalistan) ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ (Terrorist Pannu) ఈ మధ్య కాలంలో రకరకాల వార్నింగ్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజులక్రితం ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో సిక్కులు ఎవరూ ఎక్కొద్దని హెచ్చరించిన పన్నూ.. తాజాగా భారత్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాలలన్నింటినీ క్లోజ్ చేయాలని ఆల్టిమేటం జారీ చేశాడు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తే.. వారికి భారీ బహుమానం కూడా ఇస్తానని ప్రకటించాడు. 1984లో జరిగిన స్వర్ణ దేవాలయంపై దాడి, సిక్కుల ఊచకోత మారణహోమాలకు సీఆర్పీఎఫ్ (CRPF) దగ్గరుండి మనుషులను సమకూర్చిందని, అందువల్ల సీఆర్పీఆఫ్ నడుపుతున్న అన్ని పాఠశాలలను విద్యార్థులు, తల్లిదండ్రులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
కాగా.. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పన్నూ.. తాజాగా టెలిగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఢిల్లీ (Delhi)లోని రోహిణి ప్రశాంత్ విహార్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద పేలుడు వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసిన పన్నూ.. ‘‘కొందరు గూండాలతో భారత నిఘా ఏజెన్సీ మా సభ్యుల నోరు మూయించాలని చూస్తే.. ప్రపంచంలో వారే మూర్ఖులు. మేము వారికి ఎంత దగ్గరగా ఉన్నామో ఏమాత్రం ఊహించలేరు. ఏక్షణమైనా దాడి చేయగల సత్తా మాదగ్గర ఉంది. ఖలిస్థాన్ జిందాబాద్’’ అని రాసుకొచ్చాడు.
అంతే కాకుండా భారత సీఆర్పీఎఫ్‌కు నాయకత్వం వహిస్తోంది హోం మంత్రి అమిత్‌షాయేనని, హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకు కూడా కిరాయి హంతకులను హోం మంత్రే రిక్రూట్ చేశాడని ఆరోపించిన పన్నూ.. న్యూయార్క్‌లో తన హత్యకు కుట్ర పన్నారని చెప్పుకొచ్చాడు. ఎవరైనా అమిత్‌షా (Amit Shah) విదేశీ పర్యటనల సమాచారం ముందస్తుగా ఇచ్చినవారికి మిలియన్ డాలర్లు నజరానా ఇస్తానని సంచలన ప్రకటన చేశాడు.
ఇదిలా ఉంటే ఈ పేలుడుకు ఇప్పటికే ‘జస్టిస్ లీగ్ ఇండియా’ అనే ఖలిస్థానీ అనుకూల గ్రూపు బాధ్యత తీసుకోగా.. పేలుడుకు ముందు రోజు రాత్రి పాఠశాల సమీపంలో తిరిగిన ఓ వ్యక్తిని గుర్తించిన పోలీసులు అదుపులోనికి కూడా తీసుకున్నారు.