ప్రియాంకా గాంధీ పొలిటికల్ ఫ్యూచర్‌పై భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు..

ప్రియాంకా గాంధీ పొలిటికల్ ఫ్యూచర్‌పై ఆమె భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-08-13 10:33 GMT

న్యూఢిల్లీ : ప్రియాంకా గాంధీ పొలిటికల్ ఫ్యూచర్‌పై ఆమె భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక లోక్‌సభలో ఉండాలని తాను భావిస్తున్నట్టు చెప్పారు. లోక్‌సభలోకి ప్రవేశించేందుకు ప్రియాంకా గాంధీకి అన్ని అర్హతలూ ఉన్నాయన్నారు. ప్రియాంకను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా లోక్‌సభకు పంపుతుందని తాను ఆశిస్తున్నట్టు రాబర్ట్ వాద్రా పీటీఐ వార్తాసంస్థకు చెప్పారు. తనకు వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీతో లింకులు ఉన్నాయంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ లోక్ సభలో చేసిన ఆరోపణలపై రాబర్ట్ వాద్రా మండిపడ్డారు. “నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. అధికార పార్టీ(బీజేపీ) నా పేరు ప్రస్తావన తెచ్చినప్పుడే మాత్రమే వాటికి జవాబు చెప్పాల్సి వస్తోంది ” అని స్పష్టం చేశారు.

“అదానీ, ప్రధాని మోడీ ఒకే విమానంలో కూర్చొని ఉన్న ఫోటో గురించి మనం ఎందుకు ప్రశ్నలు అడగకూడదు..? రాహుల్ గాంధీ దీనిపై ప్రశ్న అడిగితే.. సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు?” అని రాబర్ట్ వాద్రా ప్రశ్నించారు. “వాళ్లు(బీజేపీ) నాపై ఏవైనా ఆరోపణలు చేస్తే.. వాటిని నిరూపించాలి. స్మృతీ ఇరానీ చెప్పిన విధంగా నేను గౌతమ్ అదానీని కలిసి ఉంటే.. దానికి సంబంధించిన ఫోటోలు నాకు చూపించండి. నాపై ఆరోపణలు చేసినందుకు స్మృతీ ఇరానీ క్షమాపణలు చెప్పాలి. నాపై చేసిన అబద్ధపు ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి” అని రాబర్ట్ వాద్రా డిమాండ్ చేశారు. మహిళా రెజ్లర్లు హక్కుల కోసం ఢిల్లీలో నిరసనలు చేస్తుంటే కనీసం వాళ్లను పరామర్శించేందుకు స్మృతీ ఇరానీ ఎందుకు వెళ్లలేదని రాబర్ట్ వాద్రా ప్రశ్నించారు.


Similar News