సంజయ్ సింగ్ బెయిల్ ఆర్డర్‌లో బన్సూరి స్వరాజ్ పేరు.. సుప్రీంకోర్టు ఆర్డర్
దిశ, నేషనల్ బ్యూరో : దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని ఓ ధర్మాసనం నేరుగా సుప్రీంకోర్టులోనే ఉన్న మరో ధర్మాసనానికి బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని ఓ ధర్మాసనం నేరుగా సుప్రీంకోర్టులోనే ఉన్న మరో ధర్మాసనానికి బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా ? విషయం తెలియాలంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్‌కు బెయిల్‌ను మంజూరు చేస్తూ మంగళవారం రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లోకి వెళ్లాల్సిందే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన ధర్మాసనం జారీ చేసిన బెయిల్ ఆర్డర్ కాపీలో దివంగత బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, అడ్వకేట్ బన్సూరి స్వరాజ్ పేరును ప్రస్తావించారు. ఈడీ తరఫు న్యాయవాదిగా ఆమె పేరును ఆర్డర్ కాపీలో చేర్చినట్లు గుర్తించారు. ఈవిషయం బుధవారం సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం ముందుకు రాగా.. వెంటనే సంజయ్ సింగ్ బెయిల్ ఆర్డర్ కాపీ నుంచి బన్సూరి స్వరాజ్ పేరును తొలగించాలని ఈడీని ఆదేశించింది. ఇలా ఎందుకు జరిగిందని ఈడీని న్యాయస్థానం ప్రశ్నించగా.. పొరపాటున బన్సూరి స్వరాజ్ పేరును టైప్ చేశారని వివరణ ఇచ్చింది. వెంటనే బెయిల్ ఆర్డర్‌ను సవరిస్తామని తెలిపింది. ఇక ఈ ఆర్డర్ కాపీలో మార్పులు చేయిస్తామని న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కూడా బదులిచ్చింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఆప్ నేత సంజయ్ సింగ్ తిహార్ జైలులో దాదాపు 6 నెలల పాటు ఉన్నారు. చివరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యంతరం లేదని చెప్పడంతో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఈ ఎన్నికల్లో న్యూఢిల్లీ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు.