డీకే శివకుమార్‌కు ఊరట: మనీలాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు
కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. 2017 ఆగస్టులో ఢిల్లీలోని అతని ఫ్లాట్లలో లెక్కల్లో చూపని డబ్బు దొరికింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఐపీసీ సెక్షన్ 120బీ కింద 2018లో డీకేపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ఈడీ 2019 సెప్టెంబర్‌లో ఆయనను అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈడీ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతుందని శివకుమార్ గతంలో ఆరోపించారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అయితే కేసు నమోదైనందున ఈడీ సమన్లను రద్దు చేయాలని డీకే హైకోర్టును ఆశ్రయించగా.. దర్యాప్తు సంస్థ నోటీసులను రద్దు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఈ తీర్పును శివకుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కేసు విచారణను నిలిపివేసింది. కాగా, గతేడాది సైతం ఈ కేసులో సంబంధమున్న మరికొందరిపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది.