ఢిల్లీకి అదనపు నీటిని విడుదల చేయండి..యూపీ, హర్యానా సీఎంలకు అతిశీ లేఖ

దేశ రాజధానిలో నీటి సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ మంత్రి అతిశీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీలకు కీలక విజ్ఞప్తి చేశారు.

Update: 2024-06-03 10:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో నీటి సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ మంత్రి అతిశీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీలకు కీలక విజ్ఞప్తి చేశారు. నెల రోజుల పాటు అదనపు నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం వారిద్దరికీ అతిశీ లేఖ రాశారు. ‘ఉష్ణోగ్రత దాదాపు 50 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. దీంతో ఢిల్లీ దాని నీటి వనరులకు సంబంధించి గరిష్టంగా విస్తరించి ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి, హర్యానా యమునా నదిలోకి అదనపు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఢిల్లీ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, అధిక ఉష్ణోగ్రత వల్ల నీటి డిమాండ్‌ ఎక్కువగా పెరిగిందని తెలిపారు. రోజువారీ అవసరాలను తీర్చడానికి మాకు అత్యవసరంగా యమునాలో నీరు అవసరమని వెల్లడించారు.

ఈ లేఖపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా స్పందించారు. నీటి సంక్షోభం పేరుతో అతిశీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. హర్యానా, ఉత్తరాఖండ్‌లు ప్రతిరోజూ అదనపు నీటిని విడుదల చేస్తున్నందున ఢిల్లీకి నీటి కొరత లేదని, దానిని ఢిల్లీ జల్ బోర్డు రికార్డు నుంచి ధ్రువీకరించొచ్చని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం మానేసి, నీటి వృధా అరికట్టడానికి ప్రయత్నించాలని సూచించారు.


Similar News